కె.సి.ఆర్ కు చిన్న, మధ్యతరహా దినపత్రికల సంపాదకుల అధ్యక్షుడు యూసుఫ్ బాబు వినతి

మిత్రులందరికీ శుభోదయం...
    చిన్న, మధ్యతరహా దినపత్రికలసంపాదకులు, జర్నలిస్టులను ఆదుకోండి.
        గౌరవనీయులైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, గౌరవ మునిసిపల్ శాఖ మంత్రి(సమాచార శాఖ బాధ్యతలను చూస్తున్నారు) ముఖ్యమంత్రి గారు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వల్ల తెలంగాణలో ఏర్పడ్డ అనూహ్య పరిస్థితుల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలంగాణా ప్రజలనే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి బ్రతుకు తెరువుకోసం మన రాష్టానికి వచ్చి లాక్డౌన్ తో ఎక్కడికీ వెళ్లలేక ఇక్కడే చిక్కిపోయిన లక్షలాదిమంది ఇతర రాష్ట్రాల ప్రజలు వలస కూలీలకు అండగా నిలిచి వారిని అక్కున చేర్చుకొని ఆదుకుని మొత్తం దేశ ప్రజలను ఆకట్టుకున్నారు. ఉంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాలన్నట్టుగా ప్రజలు, మీడియా ప్రశంసలు పొందారు. పొరుగు రాష్ట్రాల మిత్రులు మాతో మాట్లాడుతూ ఈ విపత్కర పరిస్థితుల్లో మేము తెలంగాణా లో ఉండటం మా అదృష్టం అని చెప్తుంటే మాకు గర్వంగా ఉంది. మన దేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న మిత్రులు ముఖ్యంగా USA లో ఉన్న మిత్రులు మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చూసి పొగుడుతున్నారు. ముందుగా కొంత తడబడినా ముందుగా లాక్డౌన్ ప్రకటించి కరోనా అదుపులో ఉండేలా చూసారు. వైద్య సేవల విషయంలో చాలా శీఘ్రంగా చర్యలు తీసుకొని వైద్య సేవలు అందించడంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. ఈటెల రాజేందర్, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి గారి లాంటి మంత్రులు, హైదరాబాద్ మేయర్ మినహా మహమ్మారి భయం అనుకోండి లేదా లాక్డౌన్ ఉంది కదా  అని ఎవరూ బైటికి రాని పరిస్థితుల్లో మీరు మీడియా సమావేశంలో ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఏమయ్యారు, ప్రజలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం వారికి అండగా ఉండాల్సిన బాధ్యత లేదా అని పిలుపివ్వడంతో వేలాదిమంది ముందుకు రావడంతో ఇవ్వాళ్ళ తెలంగాణాలో ప్రతిరోజు అనేక రకాలుగా ప్రజలకు అన్ని రకాలుగా సహాయం లభిస్తుంది. ముఖ్యంగా మీరు క్లిష్టమైన పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆకలితో ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో దేశంలోని ఏ రాష్ట్రంలో చేపట్టనివిధంగా 25 వేల కోట్ల ఖర్చుతో రేషన్ కార్డులున్న 87 లక్షల కోట్ల కుటంబాలకు ఉచితంగా బియ్యం అందించారు. ఒక్కో కుటుంబానికి 15 వందల రూపాయలు ఖర్చులకు అందించారు. అలాగే తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందికి అదనంగా ప్రోత్సాహకాలు ప్రకటించారు. చాలా సంతోషం. 
          తెలంగాణా లో మీ పాలనలో ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు క్షేమంగా ఉన్నారు. వాస్తవానికి వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు, మరికొంతమంది విదేశీ పర్యాటకులు, ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి వచ్చిన తబ్లీగు జమాత్ వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందివుండకపోతే ఇవ్వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా కరోనా ఫ్రీ రాష్ట్రం గా ఉండేది. అయినా మీరు, మంత్రులు, అధికారులు అహర్నిశలు కృషిచేస్తున్నారు. సాధ్యమైనంతవరకు రాష్ట్రాన్ని కరోనా నుండి రక్షించేందుకు. ఇక కేటీఆర్ గారు 24 గంటలు ప్రజలకు అండగా ఉంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలను కుల,మత, ప్రాంతాలకతీతంగా పరిష్కరిస్తూ ప్రజల్లో భరోసా కల్పిసున్నారు.
       సార్ ఇన్ని చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఆపత్కాలంలో అండగా ఉండాల్సిన యాజమాన్యాలు పట్టించుకోవడంలేదు రెండుమూడు సంస్థలు మాత్రమే జీతాలు ఇచ్చేవి. మిగతావాన్ని నెల,నెలా జర్నలిస్టుల నుండే వసూలు చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఈ పరిస్థితులు తెలంగాణలోనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో విలేకరుల పరిస్థితి మరీ దారుణం. 
       చిన్న పత్రికల పరిస్తితి మరీ దారుణం
సార్ తెలంగాణాలో చిన్న, మధ్యతరహా దిన పత్రికలు, మ్యాగజైన్స్ నడిపే సంపాదకుల పరిస్తితి మరీ దారుణంగా ఉంది. గత 20 నెలల్లో ఓకే ఒక నెల కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటన ఇచ్చారు. 2010 లో ఆగిపోయిన ఎంప్యానల్ మెంట్ తెలంగాణా ఏర్పడ్డాక ఏపీ కంటే ముందుగానే 2016 లో మన ప్రభుత్వం ఎంప్యానల్మెంట్ ప్రక్రియ ప్రారంభించి, రెగ్యులర్ గా సమాచార శాఖ కార్యాలయంలో పత్రికలు వేసే నిబంధనలు విధించి ప్రకటనలు జారీ చేసి ఆదుకుంది. వరుసగా ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించారు. 
     అయితే 2018 లో అసెంబ్లీ రద్దుకావడంతో మాకు కష్టాలు మొదలయ్యాయి. గత 20 నెలల నుండి మాకు ప్రకటనలు లేవు. అటెండెన్స్ మాత్రం తప్పడంలేదు. మాకు పూర్తి స్థాయిలో పనిచేసే కమిషనర్, డైరెక్టర్ లేరు. సమస్యలు చెప్పుకుందామంటే సమాచార శాఖకు మంత్రిలేరు. ముఖ్యమంత్రిగా మీరే ఆ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. తెలంగాణా ఏర్పడ్డాక మీరు బంగారు తెలంగాణా నిర్మాణంలో భాగంగా ప్రాధాన్య కార్యమాల్లో తలమునకలై పనిచేస్తున్నారు. మిమ్మల్ని కలవడం కుదరలేదు. 2018 ఎన్నికల ఫలితాలు వెల్లడించాక హైదరాబాద్ ప్రెస్ కక్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో గౌరవ కేటీఆర్ గారు జర్నలిస్టుల సమస్యల విషయంలో నేనె మీకు సమాచార శాఖ మంత్రిని అని చెప్పారు. కొన్ని సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు చేసారు. అయితే ఆ తర్వాత వరుసగా ఎన్నికలవల్ల బిజీగా మారారు. దానికి తోడు ఎన్నికల కోడ్ లు. ఇక ఎన్నికలన్నీ అయిపోయాయి అనుకునే సమయంలో కరోనా మహమ్మారి బారిన పడ్డాం. 
       సార్ మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 20 నెలల నుండి పత్రికలు ప్రింట్చేసి అటెండెన్స్ వేయించుకుంటు అప్పుల పాలయ్యాము. 4 పేజీలు తీసేవారు నెలకు 20 వేలు, 8 పేజీలు తీసేవారు 40 వేలు, 12 పేజీలు తీసేవారు 60 వేలు నష్టపోతున్నారు. నెలకే ఇంత నష్టమంటే 20 నెలల నుండి ఎంత నష్టం జరిగిందో ఆలోచించండి. చిన్న పత్రికలు నడిపేవాళ్లంటే ఇటీవల కాలంలో కొంత చిన్నచూపు ఉంది. మీకు తెలియని విషయాలు ఏమీలేవు. మీకు అన్ని విషయాలు తెలుసు. చిన్న పత్రికలు నడిపేవారిలో ఎక్కువ శాతం మంది గతంలో పెద్ద పత్రికల్లో, ఛానల్స్ లో పనిచేసి వివిధ కారణాల వల్ల స్వంతంగా పత్రికలు పెట్టుకొని నడుపుకుంటూ తమ కాళ్లపై తాము నిలబడడమే కాక పలువురికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు. పలువురిని ఉత్తమ జర్నలిస్టులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పత్రికలు నడిపేవారిలో నాతో సహా చాలామంది పెద్ద పత్రికల్లో పనిచేసినప్పుడు 1985 నుండి ఎమ్మెల్యే గా ఉన్న మీకు తెలిసినవారే. అనేకమంది తెలంగాణ ఉద్యమంలో మీకు అండగా ఉన్నవారే. పలు పత్రికల్లో తెలంగాణ వార్తలు ప్రచురించే పరిస్థితులు లేని సమయంలో తెలంగాణా ఉద్యమ వార్తలను పెద్దఎత్తున ప్రచురించింది చిన్న, మధ్యతరహా పత్రికలే. 
      అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో మేం పెద్ద కోరికలు ఏమీ కోరుకోవడంలేదు. కరోనాను పారదోలాక మీరు మాకు అండగా ఉంటారన్న పూర్తి నమ్మకంతో ఉన్నాము. అయితే చిన్న పత్రికలతో పాటు ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్టులను తాత్కాలికంగా ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మీడియా అకాడమీ తరపున అల్లం నారాయణ గారు, ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జర్నలిస్టులను ఆదుకోవడానికి కొంత కృషిచేస్తున్నారు. అలాగే పలువురు ప్రజాప్రతినిధులు కొన్నిచోట్ల నిత్యావసర సరుకులు అందచేస్తున్నారు. కానీ చాలామంది రేషన్ కార్డులు లేనివారున్నారు. కొందరు మొహమాటంతో, మరికొందరు లైన్లలో నిలబడి సరుకులు తీసుకోలేని వాళ్ళున్నారు. పస్తులుంటూ కూడా పక్కవారిని అడగలేక అర్ధాకలితో జీవించేవారుకున్నారు.  90 శాతమ్ మంది అద్దె ఇళ్ళల్లో ఉండేవారున్నారు. జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభమైతే ఫీజులను ఎలా చెల్లించాలని ఇప్పటినుండే ఆందోళన చెందుతున్నారు. అందరినీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల వారిని సైతం ఆదుకుంటున్న మీరు పెద్ద మనసుతో రాష్ట్రంలోని చిన్న పత్రికల సంపాదకులను, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మండలాల నుండి హైదరాబాద్ వరకు అనేకమంది జర్నలిస్టులు అనేక ఆటంకాలను ఎదుర్కొంటు వార్తలను సేకరిస్తున్న ఆడకోవాల్సిందిగా  విజ్ఞప్తి. 
     యూసుఫ్ బాబు, అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్య తరహా, మ్యాగజైన్స్ అసోసియేషన్.