మైనార్టీలపై వైకాపా ప్రభుత్వానికి చిన్నచూపు ఎందుకు ;తెలుగుదేశం

13.04.2020
     పత్రిక ప్రకటన


   మైనార్టీలపై వైకాపా ప్రభుత్వానికి చిన్నచూపు ఎందుకు? 
మైనార్టీ సోదరులను అవమానించిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని తక్షణమే బర్తరఫ్ చేయాలి
- కళా వెంకట్రావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు


 రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి మైనార్టీ సోదరులపై అక్కసు వెళ్లగక్కుతోంది, అడుగడుగునా అవమానాలకు గురిచేస్తోంది. మైనార్టీ సోదరులను కించపరిచేలా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ముస్లింలు ప్రభుత్వానికి సహకరించడం లేదనడం దుర్మార్గం. మైనార్టీల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామిని వెంటనే బర్తరఫ్ చేయాలి. శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ గారిని సాక్షాత్తూ సభలోనే ప్రభుత్వ పెద్దలు అవమానించారు. మరీముఖ్యంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఆయన పట్ల నీచంగా మాట్లాడి షరీఫ్ గారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఇప్పుడు మరో మంత్రి నారాయణ స్వామి యావత్ మైనార్టీ సోదరుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరించారు. వైకాపా ప్రభుత్వానికి మైనార్టీలు అంటే ఎందుకంత చులకనభావం. మైనార్టీలంతా టీడీపీ వెంట ఉన్నారన్న అక్కసుతో వైసీపీ నేతలు వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునేలా మైనార్టీల పట్ల బహిరంగంగా వివక్ష చూపుతున్న వైకాపా ప్రభుత్వ పెద్దల పట్ల ముఖ్యమంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారు? ముస్లింలకు జరిగిన అవమానానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదా ఈ వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ప్రజలు భావిస్తున్నారు.