నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు: వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి

నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు: వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి


.వింజమూరు, ఏప్రిల్ 13 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి) లాక్ డౌన్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించే వారిని ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమని వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నాడు వింజమూరులోని బంగ్లాసెంటర్ వద్ద విచ్చలవిడిగా తిరుగుతున్న పలు ద్విచక్ర వాహనదారులను నిలువరించి అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రించేందుకే ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించి కొద్ది రోజుల పాటు ప్రజలను స్వీయ నిర్భంధంలో ఉండాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. జన సమూహాలు లేకుండా ఉంటేనే ఈ వైరస్ ను నియంత్రించవచ్చునని ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశ్యమన్నారు. కానీ కొంతమంది ఏ పనీ పాటా లేకుండా ఏదో ఒక వంకతో రోడ్లు మీదకు వస్తున్నారని, ఇది క్షేమకరం కాదని ఆయన హితువు పలికారు. ఈ సందర్భంగా కొంతమంది ఆసుపత్రులకు వెళుతున్నామని, బ్యాంకులకు వెళుతున్నామని తెలియపరచగా పూర్తి వివరాలు సేకరించిన అనంతరం ద్విచక్ర వాహనాలపై ఒక్కొక్కరు మాత్రమే ప్రయాణం చేయాలని సూచించారు. తమకు పలుకుబడి ఉందిలే, తమకేమవుతుందిలే అని నేరుగా వచ్చిన కొంతమంది పోలీసుల ముందు అభాసుపాలు కాక తప్పలేదు. ఎస్.ఐ వారిని వాహనాల పక్కన నిలబెట్టి చరవాణి ద్వారా కేసులు నమోదు చేశారు.