విజయవాడకు పంజాబ్ నుంచి వ‌చ్చే విద్యార్థుల కోసం రైల్వేస్టేష‌న్‌లో ఏర్పాట్లు

*పంజాబ్ నుంచి వ‌చ్చే విద్యార్థుల కోసం రైల్వేస్టేష‌న్‌లో ఏర్పాట్లు


*ప‌రిశీలించిన జేసి మాధ‌వీల‌త*


*విజ‌య‌వాడ‌* : పంజాబ్ రాష్ట్రం నుంచి విజ‌య‌వాడ న‌గ‌రానికి వ‌చ్చే విద్యార్థుల కోసం రైల్వేస్టేష‌న్‌లో ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నామ‌ని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్ట‌ర్ కె.మాధవీలత తెలిపారు. ఇత‌ర రాష్ట్రాల నుండి గురు, శుక్ర‌వారాల్లో ప్ర‌త్యేక రైళ్ల ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వారు రాక సంద‌ర్భంగా విజ‌య‌వాడ రైల్వేస్టేష‌న్‌లో చేస్తున్న ఏర్పాట్ల‌ను ఆమె విజయవాడ సబ్ కలెక్టర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర, డిఆర్ఎం పి.శ్రీనివాసరావు, సీనియ‌ర్ డీఆర్ఎం పి.భాస్క‌ర్‌రెడ్డి, విజ‌య‌వాడ స్టేష‌న్ డైరెక్ట‌ర్ త‌దిత‌రుల‌తో క‌లిసి బుధవారం సాయంత్రం ప‌రిశీలించారు. ‌రైల్వే, పోలీస్ తదితర శాఖల అధికారులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాట్ల‌ను ప‌‌రిశీలించిన ‌జాయింట్ కలెక్టర్ మాధ‌వీల‌త మాట్లాడుతూ గురువారం ఢిల్లీ నుండి చెన్నై వెళ్లే రైలు విజయవాడకు రానుంద‌ని అందులో సుమారు 250 మంది మన రాష్ట్రానికి చెందిన వివిధ జిల్లా వాసులు ఉన్నారన్నారు. వారు న‌గ‌రానికి చేరుకున్న అనంత‌రం వారందకి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి ఆయా జిల్లాల వారీగా కేటాయించిన బస్సుల్లో తిరిగి  పంపడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కృష్ణాజిల్లాకు చెందిన వారిని క్వారంటైన్ కేంద్రానికి పంపిస్తామ‌ని తెలిపారు. అక్కడ వారికి కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా శుక్రవారం చెన్నై నుండి ఢిల్లీకి వెళ్లే రైలు రానుంద‌ని అందులో వచ్చే మన రాష్ట్రానికి చెందిన వారికి ఇదే తరహాలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అలాగే జలంధర్ నుండి బయలుదేరే రైలులో లౌలీ ప్రొఫిషనల్ యూనివర్శిటీలో విద్య‌ను అభ్య‌సిస్తున్న 1041 మంది విద్యార్ధులు ప్రత్యేక ట్రైన్‌లో గురువారం రాత్రికి జిల్లాకు చేరుకుంటారని, ఈ ట్రైన్ రాయనపాడు లేదా విజయవాడ రైల్వేస్టేషన్‌కు గాని వస్తుంద‌ని ఆ సమాచారం రావాల్సి ఉందన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్న‌ట్లు తెలిపారు. ఆయా విద్యార్ధులు ఏ జిల్లాలకు చెందినవారో గుర్తించి ఆయా జిల్లాల వారీగా బస్సుల్లో పంపిస్తామ‌న్నారు. కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్ధులను క్వారంటైన్ కేంద్రంలో ఉంచి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విజయవాడకు చేరుకునే ప్రతి ఒక్కరికి కచ్చితంగా థర్మల్ స్కానింగ్ నిర్వహించి తదుపరి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తామ‌ని చెప్పారు. ఇందుకు సంబంధించి రైల్వే, పోలీస్ శాఖ‌లు ఈ ఏర్పాటుకు నిర్దేశించిన జిల్లా అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. జిల్లా నుండి ఇంతవరకూ ఆయా రాష్ట్రాలకు చెందిన 6,200 మందిని ప్రత్యేక రైళ్లు ద్వారా వారి స్వస్థ‌లాల‌కు పంపడం జరిగిందన్నారు. కార్య‌క్ర‌మంలో ఆర్టీసీ ఆర్ఎం ఎం.నాగేంద్రబాబు, డ్వామా పిడి సూర్యనారాయణ, మెప్మా పిడి డాక్ట‌ర్  ఎన్.సూర్యప్రకాష్, విజయవాడ సెంట్రల్ తహసీల్దార్ జయశ్రీ, ఏసీపీ సెంట్రల్ విఎసిం అదనపు వైద్యాధికారి, బి.సి కార్పొరేషన్ ఈడి తదితరులు ఉన్నారు.