*ఆశా వర్కర్ల డిమాండ్లు పరిష్కరించాలి* పల్లాపు. అరుణ.... వింజమూరు, ఆగష్టు 25 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): రెగ్యులరైజ్, చట్టబద్దమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం తమ పట్ల దృష్టి సారించాలని మండల ఆశా వర్కర్ల సంఘం యూనియన్ అధ్యక్షురాలు పల్లాపు. అరుణ కోరారు. అలుపెరగని విధి నిర్వహణలో భాగంగా అభద్రతా భావంతో పనిచేయాల్సిన దుర్బర పరిస్థితులు ఆశా వర్కర్లను వెన్నంటి వేధిస్తున్నాయని అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. 3 సంవత్సరాల (2018-19, 2019-20, 2020-21) యూనిఫాం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నెలకు 1000 రూపాయలు జనవరి నుండి జూన్ వరకు చెల్లించాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించిన తర్వాతే ఆశాలను రిటైర్మెంట్ చేయాలని, లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా సగం పెన్షన్ ఇవ్వాలన్నారు. పర్మినెంట్ పోస్టుల భర్తీలో ఆశాలకు వెయిటేజ్ ఇవ్వడంతో పాటు సం క్షేమ పధకాలు ఆశా వర్కర్లకు వర్తింపజేయాలని ప్రభుత్వానికి సూచించారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి నెలకు 7,500 రూపాయలు, ఒక్కొక్కరికి నెలకు 10 కిలోల బియ్యం 6 నెలల వరకు సరఫరా చేయాలన్నారు. అంతేగాక ప్రస్తుత కరోనా కాలంలో ఆశా వర్కర్లు ప్రాణాలను సైతం పణంగా పెట్టి రెడ్ జోన్స్, ల్యాబ్స్, క్వారంటైన్స్, ఆసుపత్రులలో డ్యూటీలు చేయడం జరిగిందన్నారు. విధుల్లో ఉన్నవారందరికీ పి.పి.ఇ కిట్లు అందజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కోవిడ్-19 డ్యూటీ ప్రత్యేక అలవెన్స్ 10,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు 95 మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అవసరమైన మేరకు అందజేయాలన్నారు. మార్చి 15 తర్వాత మరణించిన ఆశాలకు భీమా సౌకర్యం కల్పించాలని, వారి కుటుంబంలో ఒకరికి ఆశా ఉద్యోగమివ్వాలని, కోవిడ్-19 వ్యాక్సిన్ వచ్చేంత వరకు భీమా కాలాన్ని పొడిగించాలన్నారు. సెల్ ఫోన్స్ ప్రభుత్వమే ఇవ్వాలని, ఫోన్లు కొనాలనే అధికారుల వేధింపులు ఆపాలన్నారు. రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు పని భధ్రత, పని గంటలు, సెలవులు లేవన్నారు. ప్రమాదం జరిగితే భీమా సౌకర్యం లేదని, మెటర్నిటీ సౌకర్యం లేదన్నారు. ఈ.ఎస్.ఐ, పిఎఫ్ లేదని, అనారోగ్యం పాలయితే వైద్య సౌకర్యాలు గగనమని, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ రకమైన సౌకర్యాలు లేకుండానే ఆశాలు పని చేస్తున్నారన్నారు. కనుక ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని పల్లాపు. అరుణ విజ్ఞప్తి చేశారు.