*వింజమూరు ప్రజలు జాగ్రత్తలు వహించండి* డాక్టర్ రమేష్.... వింజమూరు, సెప్టెంబర్ 22 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైధ్యాధికారి డాక్టర్ రమేష్ కోరారు. ఇప్పటివరకు మండలంలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. అయితే అదే స్థాయిలో బాధితులు కోలుకుంటుండటం సంతోషకరమైన విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ వైరస్ పట్ల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం వలన వైరస్ ప్రబలేందుకు పరోక్షంగా దోహదపడుతున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటించిన పక్షంలో కరోనాను అంతమొందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిత్యం వేడి వేడి ఆహార పదార్ధాలను భుజించడం, దాహం వేసినప్పుడు గోరువెచ్చని నీటిని సేవించడం, యోగా, ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.