*సీతారామపురం పి.హెచ్.సిలో 57 ర్యాపిడ్ పరీక్షలు* డాక్టర్ అనిష్ సల్మా.... ఉదయగిరి, సెప్టెంబర్ 21 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం ప్రాధమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో సోమవారం నాడు కరోనా వైరస్ నియంత్రణా చర్యలలో భాగంగా 57 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించినట్లు సంజీవిని బస్ ఇంచార్జ్, ఉదయగిరి సి.హెచ్.సి డెంటల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ అనిష్ సల్మా పేర్కొన్నారు. ఇప్పటికే సంజీవిని బస్ ద్వారా ఆత్మకూరు డివిజన్ పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారం కరోనా వైరస్ అధిక ప్రభావిత ప్రాంతాలలో ప్రజలకు టెస్టులు చేస్తున్నామన్నారు. సీతారామపురంలో నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులలో 7 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం జరిగిందన్నారు. వారందరికీ కూడా తగు సూచనలు, సలహాలు ఇచ్చి క్వారంటైన్ నందు ఉండాలని ఆదేశించామన్నారు. కరోనా వైరస్ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించరాదన్నారు. తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే స్థానికంగా ఉన్న వైద్యులను సంప్రదించి ఈ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకత ప్రస్తుత పరిస్థితులలో ఎంతైనా ఉందని డాక్టర్ అనిష్ సల్మా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు గానూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ సూచనలను, అధికారుల సలహాలను తప్పకుండా పాటించే విధంగా అందరూ చైతన్యం కలిగి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ర్యాపిడ్ పరీక్షలలో ఉదయగిరి సి.హెచ్.సి ల్యాబ్ టెక్నీషియన్ సాయినాధ్, ఏ.యన్.యం లు ఉన్నారు.